Category: తెలంగాణ | 22 Apr 2025
భద్రకాళి మాతకి జై..!
ఆలయ అభివృద్ధి పనులు ముమ్మరం
శర వేగంగా సాగుతున్న మాడవీధుల నిర్మాణం
మధుర మీనాక్షి, టీటీడీ తరహాలో రాజగోపురాలు
ధ్యానమందిరం, 100గదులతో సత్రం, కల్యాణ మంటపానికి ప్రణాళిక
వాహన సేవలు నిర్వహించేందుకు రూ.కోటితో మహా రథం
పనులు పూర్తయితే ఓరుగల్లు ఆధ్యాత్మిక శిఖరంగా నిలవనున్న ఆలయం
స్పైడర్, తెలంగాణ బ్యూరో : ఓరుగల్లు వాసుల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 54కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను స్వయంగా జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి, దేవాదాయశాఖ మంత్రి అయిన కొండా సురేఖల ప్రత్యేక చొరవ, పర్యవేక్షణలతో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల్లో ప్రధానమైన నాలుగు మాడవీధుల నిర్మాణం, నలువైపులా రాజగోపురాల నిర్మాణం, ధ్యానమందిరం, 100గదులతో భక్తుల వసతికి సత్రం, ఆలయ కార్యనిర్వహాక అధికారి భవనం, ప్రసాదాల వితరణకు భవనం, అన్న ప్రసాద సంత్రం, వాహన సేవలకు గాను మహారథం, కల్యాణ మంటపం నిర్మాణం వంటి పనులు చేపట్టునున్నారు.
54కోట్లు కేటాయింపు.. 30కోట్లు మంజూరు..!
ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.54కోట్లు కేటాయింపు చేయగా ఇప్పటికే 30కోట్లను విడుదల చేసింది. ఆ నిధులతో ప్రస్తుతం మాడ వీధుల నిర్మాణం జరుగుతుండగా, రాజగోపురాల నిర్మాణానికి డిజైన్లు తయారు చేశారు. మధుర మీనాక్షి, తిరుమల వేంకటేశ్వరుడి ఆలయం తరహాలో ఈ నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పడమర, ఉత్తర భాగంలోని మాడ వీధుల నిర్మాణం పూర్తి కాగా, దక్షిణ, తూర్పు భాగంలోని మాడవీధుల నిర్మాణం కొనసాగుతోంది. ఉత్తర, పడమర భాగంలోని మాడవీధుల పనులకు సంబంధించి ఫినిషింగ్ పనులుకొనసాగుతున్నాయి. ఆలయ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చదును చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. భద్రకాళి చెరువులోని నీటిని ఖాళీ చేసిన అధికారులు చెరువులోని పూడికతీత పనులు చేపట్టడంతో పాటు మాడవీధి, గోపురం నిర్మాణానికి అనుగుణంగా మట్టిని డంప్ చేస్తూ.. సమాంతరానికి తీసుకువచ్చే పనులను కొనసాగిస్తున్నారు. ఈపనులతో పాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు, నవరాత్రి, శాకంబరి వంటి ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే పల్లకి, వాహనసేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కోటి రూపాయాలతో మహా రథంను తయారు చేయనున్నారు. అలాగే ఆలయంలోనే ధ్యాన మండపం, భక్తులు విడిది చేసేలా వంద గదుల సత్రం, కళ్యాణ మంటపం నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు రూపొదిస్తున్నారు.
ప్రపంచమంతా ఓరుగల్లు వైపు చూసేలా..!
భద్రాకాళి ఆలయం జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే ప్రపంచమంతా ఓరుగల్లు వైపు చూడనుంది. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా శతాబ్దాలుగా భద్రకాళి అమ్మవారు భక్తుల పూజలందుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో చేపడుతున్న పనులతో భక్తులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అందుబాటులోకి రానున్న సౌకర్యాలతో భక్తుల రాక కూడా పెరుగుతుందని దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పనులు పూర్తయితే ఓరుగల్లు ఆధ్యాత్మిక శిఖరంగా భద్రకాళి ఆలయం నిలవనుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆలయానికి అనుబంధంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. అందులో భాగంగానే భద్రకాళి చెరువులోని ఐలాండ్‌లో ధ్యానమందిరం, తీగల వంతెన, బోటు షికారు వంటి పర్యాటక మేళవింపుతో కూడిన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్న యోచన చేస్తున్నారు.